Thursday, May 21, 2015

బతికున్నవాన్ని చంపేదీ మనమే చావాలనుకున్నవాన్ని బతికించేదీ మనమే.. మనుషులమే..

మాట పడితే బాధపడతాం అయినా మాటల్తో బాధపెడతాం
ప్రేమని ఆస్వాదిస్తాం కాని ప్రేముందని చెప్పడానికి ఆలోచిస్తాం
నవ్వుని ఇష్టపడతాం అయినా నవ్వడానికి కష్టపడతాం
మంచిని చూస్తాం కాని మనిషినని మరుస్తాం

బతికున్నవాన్ని చంపేదీ మనమే చావాలనుకున్నవాన్ని బతికించేదీ మనమే.. మనుషులమే..

Wednesday, May 6, 2015

నాతో ఎప్పుడూ నవ్వుతూ వుండే నీ కోపం చూడలేనిది

నాతో ఎప్పుడూ నవ్వుతూ వుండే నీ కోపం చూడలేనిది
నా తప్పును కూడా ముక్కుసూటిగా చెప్పే నీ మౌనం భరించరానిది .

Friday, May 1, 2015

అమ్మ భాష

ఇంగ్లీషు, అమ్మాయికి ఐలవ్యు అని చెప్పడానికి బాగుంటుదేమో గాని అమ్మని అన్నం పెట్టమని అడగడానికి సరిపోదు.
నా బాధ బయటోళ్ళకి బోధపడాలంటే ఇంగ్లీషు కావాలిగాని, నా వాళ్ళకి నేనుగా కనపడ్డానికి తోడుకాదది.
పరభాష మరో ప్రపంచాన్ని నాకు దగ్గర చేసేదయితే, మాతృభాష నా ప్రపంచాన్ని నాకెప్పుడూ దూరం కాకుండా చూసేది.
పిల్లలు అన్నీ నేర్వాలి అలాగే అమ్మ భాషా వినాలి
అదే మనల్ని మళ్ళీ చేరువచేసే పిలుపు, ఆ మాటల్లో మెదిలేవన్నీ మన జ్ఞాపకాలే.

Wednesday, April 22, 2015

ఆ కన్నీళ్ళు తుడుచుకొని త్వరగా వెనక్కి వచ్చేయ్ నేస్తమా

అమ్మాయి నీదే అయితే నువ్వెళ్ళే దారిలో ఎదురొస్తుంది లేదంటే నువ్వొచ్చేవరకు నీకెదురుచూస్తుంది.
మీకంటే ముందే మీ దారులు కలిసాయి, మీ కంటిచూపుకందే మార్గమే మీరు కలవబోయే తీరం.

నీకందనిదేదైనా వుంటే ఆ మార్గం నీది కాదులే నేస్తమా, ఆ కన్నీళ్ళు తుడుచుకొని త్వరగా వెనక్కి వచ్చేయ్..
నీ దారిలో నీతోడే కాదు నీకోసం తారాడే మనుషులెందరో ఎదురుచూస్తున్నారు... వచ్చేయ్

Saturday, April 18, 2015

D34

ఆనందాన్ని ఒకరు వెతికేదేంటి అది మన బతుకుల్లో భాగమై ఎప్పుడూ మనతోనే వుంది, పరిగెడుతూ నేనే పట్టించుకోలేదంతే..

లేక చస్తూ, ఉండి ఏడుస్తూ ఏంటి సార్ మనకీ బాధలు

నేను బతకాలంటే తిండి కావాలి, మీరు బతికుండాలంటే కనపడిందల్లా తినకుండా వుండాలి.
ఆకలున్న నేను అన్నం దొరికేదాకా, అన్నీ వున్న మీరు తిన్నది అరిగేదాకా తిరుగుతూనే వుండాలి.
లేక చస్తూ, ఉండి ఏడుస్తూ ఏంటి సార్ మనకీ బాధలు?

Monday, April 13, 2015

ఏం జరుగుతుంది భయ్యా?

పెళ్ళిలో పెళ్లి కూతురు కదా తలదించుకునేది, పెళ్ళికొచ్చిన వీల్లందరికేమైంది?
కాఫీకెళితే అందరూ చేతుల్తో పైకి,కిందకి, పక్కకని సైగలు చేస్తున్నారు, ఈ ఆఫీసంతా మూగోల్లెనా?
వాడేంటి నడుస్తూ పైకి చూడకుండా సరాసరి అమ్మాయిల బాత్రూంకి వెళ్తున్నాడు?
నిన్న రెస్టారెంట్లో మా బావ, ఓ చేత్తో ఏదో చేస్తూ ఈ చేత్తో ఏం తింటున్నాడో కూడా చూసుకోడేంటి?
చివరగా నిన్న మీ ఇంటికెలితే అందరూ ఓ చోటే వున్నారుగాని ఎవర్నెవరూ పట్టించుకోరేంటి?
ఏం జరుగుతుంది భయ్యా? నాకేదో అయ్యింది, డాక్టర్ కి ఫోన్ చేయమంటావా?

.......బాబూ, డాక్టర్ కాదుగాని ముందు నువ్వా డబ్బా ఫోన్ పాడేసి స్మార్ట్ ఫోన్ కొనుక్కో.