Thursday, February 27, 2014

మిత్రుల దీన ప్రేమ సందేశం

కడుపు ఆకలని కన్నీరవుతుంటే కనపడిన కళ్యాణ మంటపంలో కాలుపెట్టిన మాకు, పెళ్లి చూసే జనాలకంటే పళ్ళెమెక్కడని ఆరాతీసే వారి ఆత్రుత చూసి, కంగారు పడి, మరో మారుకి మజ్జిగైనా మిగలదేమోని భయపడి, అన్నం కనపడని వెరైటీలతో నింపుకున్న ప్లేటు, అది మోయలేని వెయుటుతో మా చేతులు వణుకుతున్నాయి.కంటాసుపత్రిలో కంటి పరీక్షకు వెళ్ళిన పేషెంట్లా ఒకే వైపు చూస్తున్న మా వాడి పళ్ళెంలోని పప్పు వలికిపోతుంది. 
వాడి కళ్ళు ఖాళీ అవుతున్న చికెన్ గిన్నెవైపనుకున్నాము కాని అది వడ్డించే మీవైపని, ఆ కళ్ళజోడు వెనకాలున్నకనుల లోతులోకని నాలుగు లెగ్ పీసులు లాగించిన తర్వాతగాని వెలగలేదు .ఆకలితో వుంటే వినే మాట, చూసే చూపు, మనిషి ద్యాసంతా తిండిమీదే అనేది నిజమనిపించింది.

పక్కనే వున్న మీ చిట్టి తమ్ముడికి చాక్లేటిచ్చి చిరునామా అడిగితే, చిల్లరతో చందమామని కొనాలనుకునే కక్రుతి నాయలన్న లుక్కిచ్చి , అదుగో ఆ చివరనే అని ఆకాశం వైపు వేలు చూపిచ్చి చిటుక్కున చెక్కేసాడు. మీరు మళ్లీ కనిపిస్తారని పెన్షన్ కోసం పడిగాపులు కాసే అభాగ్యుల్లా ఫంక్షన్ హాల్ దగ్గరే రోజంతా ఎదురుచూసాము.

ఇక ఆ రోజు నుంచి ప్రతీ రోజు మీ చిన్నోడు చూపిన చేయి చివర మొదలుకొని వానాకాలం దోమల మందు కొట్టేవాడిలా కాలనంత కలెదిరిగాము. మీ జాడ దొరికేవరకు మా కంట్లో కునుకు జాడ లేదు, కాళ్ళకి జండూబాం తగలని రాత్రిలేదు.
మిమ్మల్ని చూసిన మరుక్షణం మామ మిల్గయారేని ఐఅర్సిటిసి తత్కాల్ థాంక్యు పేజీ చూసినంత ఆనందం వాడి మోహంలో.

ట్విట్టర్లో తమన్నాని, బస్టాప్లో మిమ్మల్ని ఫాలో చేయడం వాడి రొటీన్ అయిపోయింది.
బస్సులో వాడి చూపులు మీ వైపుంటే, ఎదవకి మా మాటలు పంతులు చెప్పే పెళ్లి మంత్రాలు.
మీరు మరొకరితో మాట్లాడితే వాడి మొహం మంటగాలికి మండిన గుడిసెలా మాడిపోయేది.
మీరు నవ్వుతు ఓ చూపు విసిరితే , కలరైనా, కడగని నెగటివ్లా కనిపించే వాడి ఫోటోకి పేస్ బుక్ లో వంద లైకులొచ్చిన సంతోషం
సిగ్నల్ దగ్గర వుంటే సెకను సమయం లేని సినిమా స్టార్ మా వాడు, టెంపుల్ బయట మీ కోసం వెయిట్ చేయాలంటే పగలు రాత్రి తప్ప పనంటే తెలినీ మా పక్కింటి పప్పిగాడు.

తెల్లారితే మా కాలని చర్చి ఫాదర్ తెలుగులో వినిపించే యేసు సూక్తులు, రేయిలో మా వాడు మీ గురించి రాసి వినిపించే కవితలు, బాష మనదైన భావం బోధపడని మా భాదలేంటో  ఆ భగవంతుడికే తెలియాలి. 

గదిలో వాడి సడి లేకపోతే  సన్యాసం తీసుకొని హిమాలయ శిఖరాల్లో తిరుగుతున్నంత హాయి.
అది సదా సిద్దించాలని, మీ ప్రేమకై తపస్సు చేసే మా సాధువుకి మోక్షమిచ్చి మాకు ప్రశాంతతను ప్రసాదించమని ప్రాదేయపడే ఈ  దయనీయ నేస్తాలు.

        

Tuesday, February 11, 2014

వేదన అలుసైనది

గోడలు దాటిన గొడవలో వాదన బలమైనది వేదన అలుసైనది.

Friday, February 7, 2014

అణువణువు కంటతడి పెట్టిన క్షణం

పదహారేళ్ళ ప్రేమని పంచి, పరిచయం లేని పాదాలకి తలవంచి
ఆలోచనలే అక్షితలై, ఆకలి తీర్చే అమ్మ చేతులే అప్పగింతలైన క్షణం

పాతికేళ్ళ అల్లరిక చెల్లదని, అమ్మెలాగని కలవరించకుమని
పొదుపుగా మాట్లాడమని, మాట్లాడిన మాట జారకని కూతురికి నచ్చచెప్పే క్షణం 

ఇలానే వుంటాననే ఇంటినించి ఇలాగే వుండాలనే గడపలోకి కూతురిగా అమ్మ చేయినొదిలినపుడు, అమ్మనై బిడ్డని పంపినపుడు తనువులో అణువణువు కంటతడి పెట్టిన క్షణం.






Wednesday, February 5, 2014

శ్వాస నీకు సెలవని, నా ఊపిరిని ఒంటరి చేసి

Lyric : శ్వాస నీకు సెలవని, నా ఊపిరిని ఒంటరి చేసి నన్ను శిలగా మార్చి తిరిగిరాని పయనమన్నది
Situation : లోకాన్ని వీడి, తన కల వీడని ప్రేమని మరచిపోలేక..





శ్వాస నీకు సెలవని నా ఊపిరిని ఒంటరి చేసి నన్ను శిలగా మార్చి తిరిగిరాని పయనమన్నది
నా కలికి కలలోనే కనిపిస్తూ కవ్విస్తూ లాలిస్తూ,చీకటిలో ఆశని వెలుగులో నిరాశని చూస్తూ గడపమన్నది.

నా కంటి పాపకి నీ తలపులే కన్నీటి జోల
కనులు తెరిచిన కలల లోకాన నన్ను తడిమేటి నీ ప్రేమ అల
నీకై తపించి అలసిన మనసుకి ఎడబాటు లాలి
మది చేరిన మరో జగాన నన్నల్లుకున్న నీ తనువు గాలి

శ్వాస నీకు సెలవని నా ఊపిరిని ఒంటరి చేసి నన్ను శిలగా మార్చి తిరిగిరాని పయనమన్నది || 2

నిదురలో నా చెలి నవ్వు అపురూపం
ఎదురుగా కనపడని ఆ చెలిమి రూపం
రేయిలో రంగుల హరివిల్లు ఆమె అనురాగం
పొద్దు గడవని తన జ్ఞాపకాలు కడలి దుమారం

శ్వాస నీకు సెలవని నా ఊపిరిని ఒంటరి చేసి నన్ను శిలగా మార్చి తిరిగిరాని పయనమన్నది || 2

నా అరుణోదయం కలల హృదయంలో నిదరోతుంది
కల వీడితే తను కాలం వదిలిపోతుందని నా మది దిగులుపడుతుంది
కలలో తనని మురిపించే నా కనులంటే నాకిష్టం
కల చెదిరిన ఆ కనులకు కళ శూన్యం

శ్వాస నీకు సెలవని నా ఊపిరిని ఒంటరి చేసి నన్ను శిలగా మార్చి తిరిగిరాని పయనమన్నది
నా కలికి కలలోనే కనిపిస్తూ కవ్విస్తూ లాలిస్తూ చీకటిలో ఆశని వెలుగులో నిరాశని చూస్తూ గడపమన్నది.

Monday, February 3, 2014

సావిత్రి పెళ్లి

ఇదిగో మల్లేష్ గారు ఇలగుఉండండి
మీ మాటలేవో మీరు సెప్పేసుకొని ఒగ్గేస్తున్నారు, నేను సెప్పేది కూడా ఇనుకోరేటి

మబ్బు పట్ట్నేల , సినుకు రాల్నెలయితే మిమ్మల్ని సుడ్లేగానండి
ఆ పిచ్చబ్బాయితో.. క్సమించండీ.... మీ స్నేహితునితో టీ కొట్టుతానుంటే నేనేటండి మా కాలనంత సూసేవారు.
అపుడేనండి, సినిమాల్లో లాగ ప్రేమనయితే కాదుగానండీ , అందరూ సూసి అటేపెల్లె ఆ అబ్బాయి భుజాన సెయ్యేసి మాట్లాడేందుకు సక్కటి మనసుండాలనుకున్నాండి
తెల్సండి ప్రతారం మీరు నా ఎనకమాలె గుడికొస్తున్నారని, మీరు నన్ను సూసేప్పుడే మిమ్మల్ని నేను సూడ్లేదండి అంతే
మీరు డబ్బుకంటే మడిసికిచ్చిన ఇలువ తెగనచ్చేసిదండి, అప్పుడు గూడా ప్రేమలాంటిది ఏమ్లేదండి మీరంటే అభిమానం తప్ప.

నాక్కూడా కాఫీలు, పిజ్జాలు అలవాట్లేదండి
అమ్మ సేసిన టీ, అమ్మ సేత్తో ఆవకాయన్నం, నేను సేసుకొనే పని ఇయ్యేనండి నా లోకం
నేను పనిసేసేది పెద్ద హోటల్లోలెండి అందుకే నా యేసాలు మీకు ఉన్నోల్లాగానిపించిందేమో

మీరు నా ఎనకమాలె తిరుగుతుంటే భలే బాగానిపిచ్చేదండి, ఏ అమ్మాయికి బాగుండదు సెప్పండి
ప్రేమని, పెళ్లనంటే ఇయ్యన్ని వుండవుగదండి
కాని ఇయ్యేల మొదటిపాలి గుబులెసిందండి మీరు మళ్లీ కానరారేమోని
ఇయ్యేల గూడా ఇది ప్రేమా, ఇంకేదో నాకు తెలీదండి , కాని మీలాంటి మడిసిని ఒడిసిపట్టలేదన్న భాధ ఉండగూడదండి, అందుకే నాను కూడా ధైర్యం సేసి సెప్తున్నానండి

మీ మాట మందులా అనిపించినా, మీ మనసు నాకిష్టమైన ఐస్క్రీంలాంటిదండి , మనువాడదాం మల్లేష్ గారు..
ఇంతకి నా పేరు తెల్దుకదండి మీకు ... సావిత్రి

Sunday, February 2, 2014

మల్లేషన్న ఇష్క్

తాగిన మందు తల్కాయ్ వడ్తే గోలికని మందుల దుకానమచ్చిన
పొద్దుగాల పొద్దుగాల దుకుణం బందుండే, మీదికెంచి ఆన వడ్తుఉండే 
నెత్తి తడిశ్తే సర్దిలేస్తదని సందులకురికితి, ఆగో గప్పుడు జూస్తి నిన్ను

శత్తిరి వెట్టుకొని బట్టల్ కరావయితయని కిందా మీదా జూస్కుంట నడుస్తుంటివి
గదే గల్లికెంచి నలుగురు పోరగాండ్లు ఇష్టయల్ కొట్టుకుంట బండ్ల మీద జుయ్యు జూయ్యుమని పోయిర్రు ఇగేముంది నీ మీద బయ్యుమని బుడదజిల్లె
ఇగ జూస్కో గప్పుడు గాళ్ళని జూష్న సూపు తిట్టిన తిట్లు నాకు మస్తుగా నచ్చినయ్
ఇగనుకున్న, మందుల్నే గింత మంచిగుందంటే దిగినంక అద్దిరిపోద్దని, గప్పుడే ఫిక్స్ అయితి

ఆగే ఆగే నాతో తిర్గితే నీకు తక్లీఫ్ గావద్దని
వందరూపాల షాయ షాప్ల శాయ్ తాగుడు నేర్శిన
రొట్టె ముక్కల దుకాణంల రొట్టేల్దినుడు నేర్శిన
పట్నం శెరువు సుట్టూ పశార్లు కొట్టుడు నేర్శిన

ఇగ మీ ఇంటికాడ శక్కర్లు కొట్టి కొట్టి గాడున్నపిచ్చోడు గూడా బడే దోస్తయ్యిండు,పొద్దుగాల శాయి పొద్దుగూకాల శాయి గాన్తోనే తాగుతుండే
గురారం గురారం గుళ్ళేకొస్తే పంతులేమో పులారకచ్చినట్టు సూస్తుండే, మరింత పెట్టరాదే అంటినని నారాజ్ అయినట్టుండు
ఒక్కపాలన్న గిటేపు జూస్తవని గాడున్న ముష్టానికి పైసలిస్తునేవుండే, ఒక్కదినమన్నా సూపు తిప్పవైతివి
శాన దినాలు నీ ఎంట సుట్టి సుట్టి బేజారయిన, గియ్యన్నిగాదు గాని ఓ ముచ్చటయితే శెప్పాలని దైర్యంజేసి అచ్చిన

పిచ్చోడ్ని నేనొక్కన్నే మనిశిలెక్క సూశ్నని , ముష్టోడు నేను ఎష్న పైసల్తో శెప్పులు కుట్టే దుకుణం పెట్టిండని నన్ను గట్టిగ వట్టుకొని ఎడ్శిర్రు, గప్పుడు గారినయ్ నా కండ్లకెంచి బలబలామని నీళ్ళు

నువ్వు నన్ను పసంద్ జేశ్న జేయకపోయినా నాకు దిల్ అంటే సూపిచ్చినవని దిల్కుష్తో బోతున్నా... వుంటా మళ్ళ.. నీ మల్లేష్.....