Thursday, February 27, 2014

మిత్రుల దీన ప్రేమ సందేశం

కడుపు ఆకలని కన్నీరవుతుంటే కనపడిన కళ్యాణ మంటపంలో కాలుపెట్టిన మాకు, పెళ్లి చూసే జనాలకంటే పళ్ళెమెక్కడని ఆరాతీసే వారి ఆత్రుత చూసి, కంగారు పడి, మరో మారుకి మజ్జిగైనా మిగలదేమోని భయపడి, అన్నం కనపడని వెరైటీలతో నింపుకున్న ప్లేటు, అది మోయలేని వెయుటుతో మా చేతులు వణుకుతున్నాయి.కంటాసుపత్రిలో కంటి పరీక్షకు వెళ్ళిన పేషెంట్లా ఒకే వైపు చూస్తున్న మా వాడి పళ్ళెంలోని పప్పు వలికిపోతుంది. 
వాడి కళ్ళు ఖాళీ అవుతున్న చికెన్ గిన్నెవైపనుకున్నాము కాని అది వడ్డించే మీవైపని, ఆ కళ్ళజోడు వెనకాలున్నకనుల లోతులోకని నాలుగు లెగ్ పీసులు లాగించిన తర్వాతగాని వెలగలేదు .ఆకలితో వుంటే వినే మాట, చూసే చూపు, మనిషి ద్యాసంతా తిండిమీదే అనేది నిజమనిపించింది.

పక్కనే వున్న మీ చిట్టి తమ్ముడికి చాక్లేటిచ్చి చిరునామా అడిగితే, చిల్లరతో చందమామని కొనాలనుకునే కక్రుతి నాయలన్న లుక్కిచ్చి , అదుగో ఆ చివరనే అని ఆకాశం వైపు వేలు చూపిచ్చి చిటుక్కున చెక్కేసాడు. మీరు మళ్లీ కనిపిస్తారని పెన్షన్ కోసం పడిగాపులు కాసే అభాగ్యుల్లా ఫంక్షన్ హాల్ దగ్గరే రోజంతా ఎదురుచూసాము.

ఇక ఆ రోజు నుంచి ప్రతీ రోజు మీ చిన్నోడు చూపిన చేయి చివర మొదలుకొని వానాకాలం దోమల మందు కొట్టేవాడిలా కాలనంత కలెదిరిగాము. మీ జాడ దొరికేవరకు మా కంట్లో కునుకు జాడ లేదు, కాళ్ళకి జండూబాం తగలని రాత్రిలేదు.
మిమ్మల్ని చూసిన మరుక్షణం మామ మిల్గయారేని ఐఅర్సిటిసి తత్కాల్ థాంక్యు పేజీ చూసినంత ఆనందం వాడి మోహంలో.

ట్విట్టర్లో తమన్నాని, బస్టాప్లో మిమ్మల్ని ఫాలో చేయడం వాడి రొటీన్ అయిపోయింది.
బస్సులో వాడి చూపులు మీ వైపుంటే, ఎదవకి మా మాటలు పంతులు చెప్పే పెళ్లి మంత్రాలు.
మీరు మరొకరితో మాట్లాడితే వాడి మొహం మంటగాలికి మండిన గుడిసెలా మాడిపోయేది.
మీరు నవ్వుతు ఓ చూపు విసిరితే , కలరైనా, కడగని నెగటివ్లా కనిపించే వాడి ఫోటోకి పేస్ బుక్ లో వంద లైకులొచ్చిన సంతోషం
సిగ్నల్ దగ్గర వుంటే సెకను సమయం లేని సినిమా స్టార్ మా వాడు, టెంపుల్ బయట మీ కోసం వెయిట్ చేయాలంటే పగలు రాత్రి తప్ప పనంటే తెలినీ మా పక్కింటి పప్పిగాడు.

తెల్లారితే మా కాలని చర్చి ఫాదర్ తెలుగులో వినిపించే యేసు సూక్తులు, రేయిలో మా వాడు మీ గురించి రాసి వినిపించే కవితలు, బాష మనదైన భావం బోధపడని మా భాదలేంటో  ఆ భగవంతుడికే తెలియాలి. 

గదిలో వాడి సడి లేకపోతే  సన్యాసం తీసుకొని హిమాలయ శిఖరాల్లో తిరుగుతున్నంత హాయి.
అది సదా సిద్దించాలని, మీ ప్రేమకై తపస్సు చేసే మా సాధువుకి మోక్షమిచ్చి మాకు ప్రశాంతతను ప్రసాదించమని ప్రాదేయపడే ఈ  దయనీయ నేస్తాలు.

        

No comments:

Post a Comment