Sunday, September 22, 2013

అమ్మా, నా తొలి నేస్తం, నా ప్రియనేస్తం

అమ్మా, నా తొలి నేస్తం, నా ప్రియనేస్తం ............ 
నా కనులు కాంచిన తొలి స్వప్నలోకం నీ గర్బము
నా ఈ చిన్ని తనువుకి తొలి గూడు ఆ స్వప్నలోకం 
నా చెవులు విన్న తొలి సవ్వడి నీ గుండె చప్పుడు
నా పాదాలు నేర్చిన తొలి ఆట నీ ఉదరాన తన్నులాట


అమ్మా, నా తొలి నేస్తం, నా ప్రియనేస్తం ............
నా చిరునవ్వు నీ అందమైన మనసుకి ప్రతిరూపం
నా చిట్టి పలుకులు ఆ మనసు నేర్పిన సరిగమలు
నా ఆట పాట ఆ సరిగమల నాట్య విన్యాసం
నా కేరింతలు ఆ నాట్యానికి హావబావాలు

అమ్మా, నా తొలి నేస్తం, నా ప్రియనేస్తం........
నీ ఆకలి తెలిసేది నా చిన్ని బొజ్జ నిండినవేళ
నీ అలసట తెలిసేది నే హాయిగా పవళించినవేళ
నీ నిజమైన ఆనందం నా కేరింతలు చూసినవేళ 
నీ గుండెకి చెప్పలేని బాధ నా ఏడుపుకి మరుమమెరుగనివేళ

నా ఈ కొత్తబంగారు లోకం పయనం వేళ బ్రహ్మ చెప్పిన వాక్కులు జ్ఞాపకం
ఆ లోకంలో ఎప్పటికి అమ్మ అనురాగం ప్రత్యేకం,ఆప్యాయత ప్రత్యేకం,మీ ఇద్దరి అనుబంధం  ప్రత్యేకం.

Tuesday, September 17, 2013

తామర తీగను మరిపించే చేతివేళ్ళు

కోనేటి తామర తీగను  మరిపించే నీ సున్నితమైన వేళ్ళతో ముడుచుకున్న ఆ చిట్టి చేతిలో నా చేతి వేలు స్మ్రుతించుకొన్న చిన్ననాటి తీపి జ్ఞాపకం,శీతాకాలం రవి తొలి కిరణాలతో అప్పుడే మేల్కొంటున్న పచ్చటి  మొక్కలపైన చల్లటి నీటి బిందువుల్ని స్పృశించిన మధురానుభూతి.


Tuesday, September 10, 2013

చిరు జల్లుల పులకరింత

ఇంకా పదాలు కూడా పలకలేని ఆ పెదాలు నా చెంపను ముద్దాడగానే, వర్షపు జల్లులతో స్నానమాడిన సిరిమల్లె చెట్టు, ఓ చిరుగాలి పలకరింపుతో పరవశించి ఒక్కసారిగా నాపై కురిపించిన చిరు జల్లుల పులకరింతలా అనిపించింది.




Saturday, September 7, 2013

అద్బుతమైన ప్రపంచం

కను రెప్పల చాటున ఇంతటి అద్బుతమైన ప్రపంచం దాగి వుంటుందని తెలిసిన క్షణం, ఆ నయనాలు తదేకంగా నన్నే చూస్తుంటే ఒక్కసారిగా ఈ లోకం ఎంతో అందంగా అమాయకంగా కనిపించింది.


Wednesday, September 4, 2013

తొలి పలుకులు

బ బ బ ..... భ భ..... నీ హావ భావాలకి జతగా నేను సైతం అంటూ నీ గాత్రం చేసిన తొలి ప్రయత్నం . భానుడి రాకకై వేచి చూస్తూ పక్షులు పలికించే కుహు కుహు రాగాల సంగీతమంత మధురం .