Monday, December 30, 2013

మహా ప్రసాదం

గుళ్ళో అన్నదానం చేస్తే పుణ్యమంటారు ,అన్నం కోసం ఎదురుచూసేవాడికి గుడిలోపల ప్రవేశం ఉండదు.
కడుపు నిండినవాడికి అన్నదానం రోజులాగే మరో పూట భోజనం

ఆకలితో కడుపు పట్టుకున్నవాడికి నిజంగానే అది మహా ప్రసాదం.

Thursday, December 26, 2013

అమ్మ అనురాగంతో ఎదిగిన గొప్ప బంధం

ఒక జతగా కలిసుండడం కుదరదన్నారు, ఒకే జత బట్టలతో సర్దుకుపోయిన రోజులు మరిచారు
ఆస్తులు విడివిడిగా పంచమన్నారు,అమ్మ చేతి ముద్దలు ఒకటిగా పంచుకున్న క్షణాలు గుర్తురెగరు
వస్తువైనా బంధమైన నీది నాదన్నారు, కష్టమైనా సుఖమైన మనవన్న జ్ఞాపకాలు మిగలలేదు

చిన్నప్పుడు అమ్మ నేర్పించే బొమ్మలాటలాడారు, ఇప్పుడు డబ్బు ఆడించే మనుషులాటలో బొమ్మలయ్యారు
అప్పుడు బొమ్మకోసం సరదాగా కొట్టుకోనేవారు, ఇప్పుడు డబ్బు కోసం నిజంగానే కొట్టుకుంటున్నారు.

అమ్మ అనురాగంతో ఎదిగిన గొప్ప బంధం అన్నదమ్ముల అనుబంధం
ఎదురుపడితే కళ్ళలో ఆ అనురాగం నింపిన స్వచమైన ప్రేమ స్మృతుల చిరునవ్వులు కనపడాలే కాని డబ్బు పెంచిన విద్వేషాలు కావు.
లోకంలో ప్రతీది జతగా చూసిన ఆ కనులు ఇప్పుడు ఎదురుపడితే ఒకరి నుంచి ఒకరు దూరంగా వెళ్ళే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు.


Sunday, December 22, 2013

చిరునవ్వుకి వెలకట్టి

నీకు నచ్చకపోయినా నవ్వుతూ సర్దుకుపోవడం
సర్దుకుపోయిన ప్రతీసారి నవ్వలేక విసిగిపోయి గొడవపడడం
గొడవలో నీ ప్రతీ చిరునవ్వుకి వెలకట్టి దానినే త్యాగమనడం.

నీకిష్టమైన వారికోసం చేసేది నీకు సంతోషాన్ని కలిగించలేదంటే ఆ పని చేయడం కంటే ఎందుకు చేయలేవో అర్ధమయ్యేలా చెప్పగలిగితే మేలు
అది అర్దంచేసుకున్నారంటే నీ అదృష్టం లేదంటే మరో ప్రయత్నం.

Wednesday, December 18, 2013

బంధువైన ఆప్తుడైన నువ్వే

సంపన్నుడి తప్పుడు పని సామాన్యుడి గొప్ప పని కంటికి కనపడదు
నోట్లున్న నోట చెడుమాట పాట్లున్న చోట మంచిమాట మనసు గుర్తించదు

డబ్బుంటే మంచైనా చెడైనా ఈ లోకం నీవెంటే, డబ్బులేని విలువలంటే నీ బంధువైన ఆప్తుడైన నువ్వే

చేదు జ్ఞాపకాలు

ఎదుటివారి అనుభవాలు నిన్ను అప్రమత్తం చేసే తుఫాను హెచ్చరికలు
సొంత అనుభవం ఆ తుఫాను విధ్వంసం మిగిల్చే చేదు జ్ఞాపకాలు

Monday, December 16, 2013

ఇష్టపడుతున్నారనే అందమైన భావన

ఇష్టపడ్డ అమ్మాయి వెంటపడి మెప్పించి ఒప్పించి ప్రేమని చెప్పించేవాళ్ళు కొందరు
అమ్మాయే మనసుపడిందని ఎగిరి గంతేసి ప్రేమని స్వీకరించి ప్రేమించబడేవాళ్ళు మరికొందరు
ఇష్టాన్ని చెప్పలేక ఇష్టపడేవారు దొరకక ప్రేమ తమ వంటికి పడదని తిరిగేవారు ఇంకొందరు

ప్రతి మనిషి తన జీవిత పయనంలో ఏదో ఒక క్షణం తనని ఒకరు ఇష్టపడుతున్నారనే అందమైన భావన కోరుకొని వుంటాడు

Wednesday, December 11, 2013

డబ్బు

డబ్బు వుందని చూపించేవాడికి పదిమంది తన గురించి ఏమనుకుంటున్నారనే దిగులు
ఆ డబ్బుతో కన్నీళ్లు తుడిచేవాడికి తను చేసిన పని నలుగురికి ఉపయోగపడిందనే ఆనందం

Sunday, December 8, 2013

దిగులుపడే స్నేహం

నువ్వు కనపడకపోయినా చాలా బాగుండాలని కోరుకునేది ఒక స్నేహం
నీ ముందు నవ్వుతూ కనపడినా ఎలా బాగుపడ్డావని దిగులుపడేది మరొక స్నేహం

Saturday, December 7, 2013

అమ్మాయి క్యారెక్టర్

పెళ్ళికి ముందు అమ్మాయి క్యారెక్టర్ గురించి ఆరా తీసేవాడికి పెళ్ళి తరువాత నమ్మకం అనే మాట వాడే అర్హత లేదు

ఓ బ్రహ్మచారి మనోవేదన

పెళ్లి చూపులు చూసి చూసి అలసిన ఓ బ్రహ్మచారి మనోవేదన 

పాతికేళ్ళు నిండాయి,అన్ని అర్హతలున్న పెళ్ళీడుకు వచ్చిన కుర్రాడిగా నా స్థితి ||
నాకు అమ్మాయి చదువుతో పాటు అందం వుండాలి
నాన్నకు సొంత ఇల్లుతో పాటు మంచి కట్నం ఇవ్వాలి
అమ్మకి బంగారంతో పాటు పట్నం పిల్ల కావాలి
బామ్మకి కులంతో పాటు గోత్రం తెలిసిందయి వుండాలి

మరో రెండేళ్ళు గడిచాయి,అన్ని అర్హతలున్న పెళ్ళి వయసు దాటిపోతున్న అబ్బాయిగా నా పరిస్థితి ||
నాకు 
అమ్మాయి పెద్ద అందంగా లేకపోయినా గుణం మంచిదయి వుండాలి
బామ్మకి గోత్రం ఏదయినా కులం మాత్రం ఒకటయి వుండాలి
అమ్మకి ఊరి పిల్లయినా బంధువులు గొప్పగా చెప్పుకునే సంబంధం అయి వుండాలి
నాన్నకి కట్నం ఇవ్వకపోయినా ఇల్లు కట్టుకోనేంత స్థలం ఇవ్వాలి

ఇంకో నాలుగేళ్ళు పోయాయి, చెల్లి పెళ్ళి కుడా అయి వయసు తప్ప అన్ని అర్హతులున్న మనిషిగా నా దుస్థితి ||
నాన్నకి లాంచనాల కంటే అమ్మాయి తల్లిదండ్రి పడే బాధలు అవమానాలు కనిపించాయి
అమ్మకి బంగారం కంటే అనురాగం విలువైనదని తెలిసొచ్చింది
బామ్మ బతికుంటే ఏమనుకునేదో తెలియకుండానే పైకి పోయింది
నాతో పాటు ఇప్పుడు ఎవరికీ ఏ ఆంక్షలు లేవు అయినా నాకు పిల్లనివ్వాలన్న కాంక్ష ఎవరికీ లేదు.

Sunday, December 1, 2013

చూపులు కలిసిన ప్రేమ మనసులు కలిసిన ప్రేమ

నీ నడకలోని హొయలకు కాదు ఆ నడవడికలోని సొగసులకు నా మనసు జోహార్లు
నీ పెదాల అందాలు కాదు అవి పలికే పదాలు మదిని మాయచేసే మాటల మంత్రాలు
నీ కంటి మెరుపులు కాదు అవి నింపుకున్న అనురాగాలు మేనిని చుట్టే వెన్నెల వెలుగులు
నీ చేతి స్పర్శలోని పులకరింత కాదు అవి అందించే సాయంలోని గొప్పతనం వెల కట్టలేనిది
నీ పాదాలు అలంకరించుకున్న రంగులకి కాదు అవి ఎంచుకున్న ఆదర్శాల అడుగులకి నేను దాసోహం

కాలంతో పాటు కరిగిపోయేది సొగసు, ఆ కాలం మట్టిలో కలిపేంతవరకు తిరుగులేనిది మనసు
అందుకేనేమో చూపులు కలిసిన ప్రేమ మనసులు కలిసిన ప్రేమ అని రెండు రకాల ప్రేమలు వింటుంటాం