Sunday, October 27, 2013

సిగ్గులేకుండా తినేది

తినే తిండి దగ్గర మొహమాట పడకూడదంటారు,
కాని పడుతున్నామంటే మనం ఉన్నది పరాయింట్లో,సిగ్గులేకుండా తినేది మనం అనుకునే వారింట్లో.
పరాయింట్లో పది రుచులుండొచ్చు కానీ మనింట్లో ఒక్క రుచి అయినా ప్రేమతో వడ్డించే పది చేతులుంటాయి.

Monday, October 21, 2013

ప్రేమని నటించేవాళ్ళు

తీపి మాటలతో ప్రేమని నటించేవాళ్ళు మన ఆప్తులు
నిజమైన ప్రేమ ఉండి దాన్ని వ్యక్తపరచలేని వాళ్ళు పొగరుబోతులు 
ఏంటో మబ్బుకి ఆకాశానికి వున్న వ్యత్యాసం తెలుసుకోలేక పోవడం !!

Sunday, October 20, 2013

బాగున్నావా

ఈ మధ్య బాగున్నావా అంటే ఎలా వున్నావు అని కాకుండా ఎంత బాగా సంపాదిస్తున్నావు లా వినిపిస్తుంది

Saturday, October 5, 2013

ఎన్నిసార్లైన ఆడపిల్లగా జన్మించడానికి సిద్దం

ఈ లోకం నిట్టూర్పుతో ఆడపిల్లగా నా జీవిత పయనం ఆరంభం
ఆ నిట్టూర్పు మిగిల్చిన నిరాశలో నే పుట్టిన సంతోషాన్ని పంచుకోలేని నా కన్నవారు 
ఆ నిరాశ నా నీడయై అనుక్షణం నేను ఆడపిల్లనని గుర్తు చేస్తూ గడచిన నా బాల్యం
ఆ బాల్యం పెనవేసుకున్న అనుబంధపు అక్షరాల పేజీని తిరగేస్తూ పెళ్లి అనే కొత్త జీవితపు అక్షరాలు దిద్దించే ఈ సమాజం
ఆ జీవితాన్ని డబ్బుతో వెలకడుతూ మనిషి విలువను దిగజార్చే వరకట్న దురాచారం
ఆ దురాచారపు లోగిలిలో నే ఎదిగే కొద్ది పెరిగే నా కన్నవారి గుండె బరువు

ఆ కన్నవారి మా ఇంటి మహాలక్ష్మి నుంచి ఆ ఇంటి కోడలిగా ఇంటిపేరుతో పాటు నా గుర్తింపుని కూడా కోల్పోయిన వేడుకకి సాక్షి పెళ్లి.

ఆడపిల్లనని నిరాశ ఎదురైన ప్రతిసారి నా భుజం తట్టే ఎన్నో మధుర జ్ఞాపకాలు, ప్రతి అడుగులో నే పంచుకున్న అనుబందాలు.

అమ్మకి సాయంలో తన చీర కొంగునై,జ్ఞాపకాలు పంచుకొనే నేస్తాన్నై
నాన్నకి చిరునవ్వుల ఉషోదయాన్నై,సిరివెన్నెల శుభరాత్రినై
తమ్ముడి చిలిపి చేష్టల ఆటబొమ్మనై, కన్నీటికి చలించే అలనై
అన్నను ఆటపట్టించే మబ్బు చాటు జాబిల్లినై, మమకారపు రాఖినై

ప్రియుడి అబద్దాలకైన కరిగిపోయే హిమపాతాన్నై,వంచనకు గుండె దాచిన కన్నీటి సముద్రాన్నై
భర్తకి అన్నిటా పుడమికి మట్టిలా తోడునై , కడదాకా ఆ మట్టిలో కలిసే పయనాన్నై

అన్ని బంధాలతో దేవుడిచ్చిన ప్రేమని పంచుకున్నానన్న సంతృప్తితో నా ఈ జీవిత పయనం ముగింపు.

నా సున్నితమైన మనసుని బలహీనతగా చేసుకొని వంచనకు గురికాని, ప్రతి తల్లిదండ్రి ఆడపిల్లే కావాలని కోరుకొనే వరకట్న దురాచార రహిత సమాజంలో ఎన్నిసార్లైన ఆడపిల్లగా జన్మించడానికి సిద్దం.