Sunday, December 28, 2014

D20

నేనెందుకిలా వున్నానో తెలియని నీకు, నువ్వలా ఎందుకు చేయలేవని చెప్పడం చాలా సులువు.

D19

నచ్చని మాటలు వింటూ నలుగురిలో నవ్వుతూ నటించలేవు
చుట్టాల చావుకెళ్ళి బాధలేకున్నా బోరుమని ఏడవలేవు
నీలో వున్న మనిషి ఒక్కడే, నువ్వు మాట్లాడే మాటొక్కటే, అందుకే వీళ్ళందరికి నచ్చంది నువ్వొక్కడివే.
నీలా ఒక్కరోజుంటేనే తెలిసింది నేస్తం నేనంటే గిట్టని వాళ్ళింతమందుంటారాని.

Thursday, December 25, 2014

D18

చెప్పాలనుకున్న సమయం నాకున్నా, అర్ధం చేసుకొనే సందర్బం నీది కాదంటే
సర్లేని సందర్బం కోసం నేను వేచుంటే, దేనికోసమో నేనగాలేనంటూ నను దాటిందీకాలం.

ప్రేమున్నా కాలం కరుణించక, పద్దతున్నా పరిస్థితుల పరీక్షలో ఓడిన జంటలెన్నో.

Sunday, December 7, 2014

D17

పిల్లాడు అమ్మ కొడితే, ఆడుకుంటూ కింద పడితే ఏడుస్తాడు.
వీడు మాత్రం నచ్చిన అమ్మాయి పడకపోతే , ఆపై పెళ్ళయి కనపడకపోతే  ఏడవడానికనే  తాగుతాడు. 

Monday, December 1, 2014

D16

నువ్వుంటే నాలా నేనుంటా, ఒంటరిగా వుంటే నాతో నేనేంటనుకుంటా.

D15

పాత కథకి కొత్త కధనంలా, పాతికేళ్ళ మన ప్రేమ కథకి పెళ్లి పాతది గాని మన ప్రేమ కాదు.

Monday, November 24, 2014

అలుపెరుగని యోధుడు

దేవుడిముందు కోరికలెన్నో మీవి, గుడిచుట్టూ ప్రదక్షిణలన్నీ మావాడివి
మీ కోరికలకు స్పీడెక్కువ, ఇక మావాడి కాళ్ళకి అలుపెక్కడ
భగవంతుడు మీ భక్తి మెచ్చి వరాలిస్తున్నాడా, మావాడి తిక్క కుదురుస్తున్నాడ తెలియట్లేదు
వాడ్ని కలవాలంటే గుడైనా మూసుండాలి లేక మీరు దేవుడ్ని అడగడమైనా ఆపుండాలి
మనిషి ఆశకి శుభం కార్డు పడదని తెలుసు, అందుకే వాడొచ్చేవరకు శవాల్లా ఇక్కడే పడున్నాం
పెళ్ళయితే మారిపోతాడనుకున్నాం కాని, ఇలా మీ మొక్కులు తీరుస్తూ అలుపెరుగని
యోధుడవుతాడనుకోలేదు.
  

Sunday, November 23, 2014

D14

పుట్టుకతోనే నడవలేం
పుట్టాక నడవాలని పడిలేస్తాం
బ్రతుకన్నాక పడిలేస్తూ నడుస్తాం

నువ్వు గెలవాలని నడిచావు, నడవాలని నిలబడ్డావు.  

Saturday, November 22, 2014

D13

జతకాని జాతకాల కన్నా, జంటవాలనుకొనే మా జీవితాలు మాకు గొప్పవి.

Thursday, November 20, 2014

D12

అమ్మ అడుగులు నేర్పింది, జీవితం నేనెలా నడవకూడదో చూపింది.

Monday, November 17, 2014

D11

ఊపిరి ఉన్నంతవరకే నువ్వు బాగా ఉన్నోడివి, చచ్చిన తర్వాత షహాన్షానైనా శవమనే అంటారు.

Sunday, November 16, 2014

D10

చూసేవాళ్లకే నీకున్నది ఆట్టిట్యూడ్, నీ గురించి తెలిసిన వాళ్ళకి అది నీ క్యారెక్టర్.

Tuesday, November 11, 2014

D9

స్నేహం పేరుతో నిన్ను కలవాలి, ప్రేమని చెప్పి నీతో కలిసి తిరగాలి
వాడేప్పుడు నిన్ను కావాలనుకున్నాడే తప్ప నీతో కలిసుండాలనుకోలేదు

Thursday, October 30, 2014

D8

నీతో కలిసుండాలంటే నేను మారాలని నువ్వంటున్నావు,
నన్ను కావాలనుకొనే వాళ్ళతో నాలాగే వుండాలని నేను కోరుకుంటున్నాను.

Saturday, October 25, 2014

D7

నువ్వంటే అబ్బాయిలు పడిచస్తారనే మాట నిజమే కావచ్చు
పడిచచ్చేంత అందం నీదైనా నాతో కలిసి బతికేంత వ్యక్తిత్వం నీకు లేదు.

Sunday, October 19, 2014

D6

నిన్నటి నీ బాధ రేపటి నా ఆలోచనతో నేడు మనకి చోటేది
నేడుంటే అది నిన్నని నిజం నీకు తెలుసు రేపసలేముందో ఎవరికి తెలుసు

Friday, October 3, 2014

D5

నా వాళ్ళెవరు లేనప్పుడు ఒక్కడిగానే బ్రతకడం తెలుసు
ఇపుడు నా అన్నవాళ్ళు నేనొక్కడినే అంటే మొదటిసారి ఒంటరితనమంటే తెలుస్తుంది

Monday, September 29, 2014

D4

నేను నీకు నచ్చలేదంటే చాలా బాధనిపించింది
నాకు నేను నచ్చిన తర్వాత నీకసలు అదృష్టమే లేదనిపించింది.

Saturday, September 27, 2014

D3

నమ్మకం అంటే నవ్వుతూ వున్నప్పుడు నీతో వున్నానని చెప్పేది కాదు
నలుగురిలో నవ్వుల పాలైనా నువ్వు నాతో వున్నావనిపించేది.

Friday, September 26, 2014

D2

నేననుకున్నది ఇప్పటికిప్పుడు జరగకపోవచ్చు కాని ఇప్పుడు జరిగే ప్రతీది ఎప్పుడో ఒకప్పుడు నే కోరుకున్నదే !!

Wednesday, June 18, 2014

D1

నేను చెప్పేదాంట్లో నిజమెంతని నువ్వు ఆలోచించినా భాధపడేవాన్ని కాదేమో
కాని నేను చెప్పేదేది నిజం కాదన్నట్లు నీ కనులు చూస్తుంటే గొంతు చేరిన నా గుండె భావాలు మూగబోయాయి

నా మాట వినే స్థితిలో నువ్వు లేనప్పుడు అసలు పరిస్థితి నీకు చెప్పాలన్న నా ఆరాటంలో అర్ధం లేదు

నమ్మకం అంటే నవ్వుతూ వున్నప్పుడు నీతో వున్నానని చెప్పేది కాదు
నలుగురిలో నవ్వుల పాలైనా నువ్వు నాతో వున్నావనిపించేది.

Saturday, April 5, 2014

Lyric : వెలుగునే గువ్వల రాగాలు, పగలే పక్షుల కిలకిలలు

వెలుగునే గువ్వల రాగాలు, పగలే పక్షుల కిలకిలలు
సుఖానే వెల్లువలా జనాలు, నిశీధిన పరుగుల రూపాలు, వీళ్ళకేనా బదులు చెప్పాలన్నదిగాలు ?

     కట్టే ఇల్లు కట్టుకునే బట్టలు, పెట్టుకునే నగలు పెట్టె కట్న కానుకలు
     పనేదైనా పరులు మెచ్చితేనే ప్రతి ఫలమా?
     జనమే జగమని నడవాలా, జనాల గుస గుసలె జీవితమా?
     మనమే మనకని మరవాలా, మది ఊసులే పలకని మూగలా మారాలా?

వెలుగునే గువ్వల రాగాలు, పగలే పక్షుల కిలకిలలు ||2

     పిల్లల ప్రేమ ఊరంతా ఒప్పుకోవాలా, గుప్పెడంత మీ గుండె చెప్పదా?
     కూతురి పెళ్లి లోకమంతా ఆమోదించాలా, చిన్నారి నవ్వులే లోకమన్న మీ ప్రేమ చాలదా?
     నలుగురు నచ్చక మార్చే నగలు , పరువును పెంచే పదవులు కావు బంధాలు
     బ్రతుకున భాగమైన భావాలు , మనసులనే మనుషులు
     పెద్దలుగా ఇవే మీకు మా విన్నపాలు

వెలుగునే గువ్వల రాగాలు, పగలే పక్షుల కిలకిలలు
సుఖానే వెల్లువలా జనాలు, నిశీధిన పరుగుల రూపాలు, వీళ్ళకేనా బదులు చెప్పాలన్నదిగాలు ?

Saturday, March 29, 2014

Lyric : డబ్బు మూటలు, మభ్యపెట్టే మాటలే గెలుపు సూత్రాలు

ఎన్నికలొస్తున్నాయి అవినీతి నాయకులొస్తున్నారు
డబ్బు మూటలు, మభ్యపెట్టే మాటలే గెలుపు సూత్రాలనే ధీమాతో దిగుతున్నారు

మగాడిని మందు సీసాతో పడగొట్టి, అతివని అందమైన చీరతో ఆకట్టుకొని
తాత చుట్టలకు  తైలమిచ్చి, అవ్వ చేసంచికి సాయమందించి
కాలేజి కుర్రాళ్ళకు క్రికెట్ కిట్లు కలర్ ఫోన్లిచ్చి, కనిపించిన వాళ్ళకు  ఫోటో ఫోజులిచ్చే

ఎన్నికలొస్తున్నాయి అవినీతి నాయకులొస్తున్నారు || 2
అసలేదో అవసరమేదో తెలుసుకోలేని అమాయక జనాలు ఓట్లని కదిలారు

ఏ మందు ఎవడిచ్చాడో మతిలేని తాగుబోతు, గుర్తున్నోడి గుర్తుకే మనోడి మత్తు ఓటు
వీధిలో వారంతా ముచ్చటించి చివరకి కంచి పట్టు స్థాయి వున్నోడికే వనితల విలువైన ఓటు
ఓపికుంటే, ఓర్పుతో ప్రేమగా పలకరించినోడికే మూడుకాళ్ల పెద్దరికపు ఓటు
కాలేజంటే ఆటపాటలే అంతటా అనే పసి ఓటర్లు, బ్యాట్ ఇచ్చినోడికే బ్యాలెట్లో చోటు

ఎన్నికలొస్తున్నాయి అవినీతి నాయకులొస్తున్నారు || 2

తాగితే తనువంతా నిషా లోకమంతా తమాషా, సీసాల బానిసలే అవినీతి నాయకుల బరోసా
ఆలోచనలేని ఆశ, ఆశకి తలవంచే మనిషి బలహీనతే అవినీతికి ఆయువు
కాలం చూపిన కష్టాలు, అనుభవం నేర్పిన పాఠాలు పట్టించుకోని మనవారే తప్పులకి చేయూత
రాజకీయాలు విశ్లేషించి, పరిస్థితులను పసిగట్టే యువత ఈ నిజాలు ఊరంతా చెప్పలేకపోయినా వారింట్లో చెప్పి మెప్పించగలిగినా సమాజానికి గొప్ప మేలే.

ఎన్నికలొస్తున్నాయి అవినీతి నాయకులొస్తున్నారు
డబ్బు మూటలు, మభ్యపెట్టే మాటలే గెలుపు సూత్రాలనే ధీమాతో దిగుతున్నారు

Sunday, March 16, 2014

భక్తి భయంతో పూజించడానికా ? భగవంతుడిని ప్రేమించడానికా?

గుడిలో కొలువైన దేవుడు అడగకున్నా భక్తితో అర్పించుకునే ఆభరణాలు
ప్రతీ గుండె గుడిలో నెలవై వున్నాడన్న స్వామి ఆకలన్నా ఆలకించని మహా భక్తులు

దేవుడి హుండీలో వందలు నింపే వేల చేతులు,దేహి అన్నవాడి చేతిలో పెట్టే చిల్లరకైనా పలు ఆలోచనలు
దేవుడి రాబడి గుడికి పెరిగే పలుకుబడి,వందలో పది అందినా అనాధకి నడిచే బ్రతుకు బడి ||

మొక్కు తీర్చకపోతే చిక్కులోస్తాయని చింతన
ఉపవాసం మరచితే ఉపద్రవమేనని ఆందోళన
భక్తి భయంతో పూజించడానికా ? భగవంతుడిని ప్రేమించడానికా?

భయంతో అడుగిడిన గుడిలో ప్రశాంతత వెతికే కంటే భక్తితో అనురక్తితో మదిలో తలిస్తే సంతృప్తి మిగలదా ?

Wednesday, March 12, 2014

ప్రేమని, ప్రేమికున్ని పరిస్థితుల ప్రకారం వాడుకునే వనితలు

లైఫ్ బాగా బోరింగా వుంది బాయ్ ఫ్రెండ్ కావాలి
స్టేటస్ చక్కగా వున్నవాడిని బాయ్ ఫ్రెండ్ చేసుకోవాలి
ఫ్రెండ్స్ కి గొప్పగా చెప్పుకోవడానికి బాయ్ ఫ్రెండ్ వుండాలి

రోడ్ల మీద రోమియోలు, సదా సేవలో శాజహాన్లు, ప్రేమని, ప్రేమికున్ని పరిస్థితుల ప్రకారం వాడుకునే వనితలూ వున్నారు జాగ్రత్త.

Thursday, February 27, 2014

మిత్రుల దీన ప్రేమ సందేశం

కడుపు ఆకలని కన్నీరవుతుంటే కనపడిన కళ్యాణ మంటపంలో కాలుపెట్టిన మాకు, పెళ్లి చూసే జనాలకంటే పళ్ళెమెక్కడని ఆరాతీసే వారి ఆత్రుత చూసి, కంగారు పడి, మరో మారుకి మజ్జిగైనా మిగలదేమోని భయపడి, అన్నం కనపడని వెరైటీలతో నింపుకున్న ప్లేటు, అది మోయలేని వెయుటుతో మా చేతులు వణుకుతున్నాయి.కంటాసుపత్రిలో కంటి పరీక్షకు వెళ్ళిన పేషెంట్లా ఒకే వైపు చూస్తున్న మా వాడి పళ్ళెంలోని పప్పు వలికిపోతుంది. 
వాడి కళ్ళు ఖాళీ అవుతున్న చికెన్ గిన్నెవైపనుకున్నాము కాని అది వడ్డించే మీవైపని, ఆ కళ్ళజోడు వెనకాలున్నకనుల లోతులోకని నాలుగు లెగ్ పీసులు లాగించిన తర్వాతగాని వెలగలేదు .ఆకలితో వుంటే వినే మాట, చూసే చూపు, మనిషి ద్యాసంతా తిండిమీదే అనేది నిజమనిపించింది.

పక్కనే వున్న మీ చిట్టి తమ్ముడికి చాక్లేటిచ్చి చిరునామా అడిగితే, చిల్లరతో చందమామని కొనాలనుకునే కక్రుతి నాయలన్న లుక్కిచ్చి , అదుగో ఆ చివరనే అని ఆకాశం వైపు వేలు చూపిచ్చి చిటుక్కున చెక్కేసాడు. మీరు మళ్లీ కనిపిస్తారని పెన్షన్ కోసం పడిగాపులు కాసే అభాగ్యుల్లా ఫంక్షన్ హాల్ దగ్గరే రోజంతా ఎదురుచూసాము.

ఇక ఆ రోజు నుంచి ప్రతీ రోజు మీ చిన్నోడు చూపిన చేయి చివర మొదలుకొని వానాకాలం దోమల మందు కొట్టేవాడిలా కాలనంత కలెదిరిగాము. మీ జాడ దొరికేవరకు మా కంట్లో కునుకు జాడ లేదు, కాళ్ళకి జండూబాం తగలని రాత్రిలేదు.
మిమ్మల్ని చూసిన మరుక్షణం మామ మిల్గయారేని ఐఅర్సిటిసి తత్కాల్ థాంక్యు పేజీ చూసినంత ఆనందం వాడి మోహంలో.

ట్విట్టర్లో తమన్నాని, బస్టాప్లో మిమ్మల్ని ఫాలో చేయడం వాడి రొటీన్ అయిపోయింది.
బస్సులో వాడి చూపులు మీ వైపుంటే, ఎదవకి మా మాటలు పంతులు చెప్పే పెళ్లి మంత్రాలు.
మీరు మరొకరితో మాట్లాడితే వాడి మొహం మంటగాలికి మండిన గుడిసెలా మాడిపోయేది.
మీరు నవ్వుతు ఓ చూపు విసిరితే , కలరైనా, కడగని నెగటివ్లా కనిపించే వాడి ఫోటోకి పేస్ బుక్ లో వంద లైకులొచ్చిన సంతోషం
సిగ్నల్ దగ్గర వుంటే సెకను సమయం లేని సినిమా స్టార్ మా వాడు, టెంపుల్ బయట మీ కోసం వెయిట్ చేయాలంటే పగలు రాత్రి తప్ప పనంటే తెలినీ మా పక్కింటి పప్పిగాడు.

తెల్లారితే మా కాలని చర్చి ఫాదర్ తెలుగులో వినిపించే యేసు సూక్తులు, రేయిలో మా వాడు మీ గురించి రాసి వినిపించే కవితలు, బాష మనదైన భావం బోధపడని మా భాదలేంటో  ఆ భగవంతుడికే తెలియాలి. 

గదిలో వాడి సడి లేకపోతే  సన్యాసం తీసుకొని హిమాలయ శిఖరాల్లో తిరుగుతున్నంత హాయి.
అది సదా సిద్దించాలని, మీ ప్రేమకై తపస్సు చేసే మా సాధువుకి మోక్షమిచ్చి మాకు ప్రశాంతతను ప్రసాదించమని ప్రాదేయపడే ఈ  దయనీయ నేస్తాలు.

        

Tuesday, February 11, 2014

వేదన అలుసైనది

గోడలు దాటిన గొడవలో వాదన బలమైనది వేదన అలుసైనది.

Friday, February 7, 2014

అణువణువు కంటతడి పెట్టిన క్షణం

పదహారేళ్ళ ప్రేమని పంచి, పరిచయం లేని పాదాలకి తలవంచి
ఆలోచనలే అక్షితలై, ఆకలి తీర్చే అమ్మ చేతులే అప్పగింతలైన క్షణం

పాతికేళ్ళ అల్లరిక చెల్లదని, అమ్మెలాగని కలవరించకుమని
పొదుపుగా మాట్లాడమని, మాట్లాడిన మాట జారకని కూతురికి నచ్చచెప్పే క్షణం 

ఇలానే వుంటాననే ఇంటినించి ఇలాగే వుండాలనే గడపలోకి కూతురిగా అమ్మ చేయినొదిలినపుడు, అమ్మనై బిడ్డని పంపినపుడు తనువులో అణువణువు కంటతడి పెట్టిన క్షణం.






Wednesday, February 5, 2014

శ్వాస నీకు సెలవని, నా ఊపిరిని ఒంటరి చేసి

Lyric : శ్వాస నీకు సెలవని, నా ఊపిరిని ఒంటరి చేసి నన్ను శిలగా మార్చి తిరిగిరాని పయనమన్నది
Situation : లోకాన్ని వీడి, తన కల వీడని ప్రేమని మరచిపోలేక..





శ్వాస నీకు సెలవని నా ఊపిరిని ఒంటరి చేసి నన్ను శిలగా మార్చి తిరిగిరాని పయనమన్నది
నా కలికి కలలోనే కనిపిస్తూ కవ్విస్తూ లాలిస్తూ,చీకటిలో ఆశని వెలుగులో నిరాశని చూస్తూ గడపమన్నది.

నా కంటి పాపకి నీ తలపులే కన్నీటి జోల
కనులు తెరిచిన కలల లోకాన నన్ను తడిమేటి నీ ప్రేమ అల
నీకై తపించి అలసిన మనసుకి ఎడబాటు లాలి
మది చేరిన మరో జగాన నన్నల్లుకున్న నీ తనువు గాలి

శ్వాస నీకు సెలవని నా ఊపిరిని ఒంటరి చేసి నన్ను శిలగా మార్చి తిరిగిరాని పయనమన్నది || 2

నిదురలో నా చెలి నవ్వు అపురూపం
ఎదురుగా కనపడని ఆ చెలిమి రూపం
రేయిలో రంగుల హరివిల్లు ఆమె అనురాగం
పొద్దు గడవని తన జ్ఞాపకాలు కడలి దుమారం

శ్వాస నీకు సెలవని నా ఊపిరిని ఒంటరి చేసి నన్ను శిలగా మార్చి తిరిగిరాని పయనమన్నది || 2

నా అరుణోదయం కలల హృదయంలో నిదరోతుంది
కల వీడితే తను కాలం వదిలిపోతుందని నా మది దిగులుపడుతుంది
కలలో తనని మురిపించే నా కనులంటే నాకిష్టం
కల చెదిరిన ఆ కనులకు కళ శూన్యం

శ్వాస నీకు సెలవని నా ఊపిరిని ఒంటరి చేసి నన్ను శిలగా మార్చి తిరిగిరాని పయనమన్నది
నా కలికి కలలోనే కనిపిస్తూ కవ్విస్తూ లాలిస్తూ చీకటిలో ఆశని వెలుగులో నిరాశని చూస్తూ గడపమన్నది.

Monday, February 3, 2014

సావిత్రి పెళ్లి

ఇదిగో మల్లేష్ గారు ఇలగుఉండండి
మీ మాటలేవో మీరు సెప్పేసుకొని ఒగ్గేస్తున్నారు, నేను సెప్పేది కూడా ఇనుకోరేటి

మబ్బు పట్ట్నేల , సినుకు రాల్నెలయితే మిమ్మల్ని సుడ్లేగానండి
ఆ పిచ్చబ్బాయితో.. క్సమించండీ.... మీ స్నేహితునితో టీ కొట్టుతానుంటే నేనేటండి మా కాలనంత సూసేవారు.
అపుడేనండి, సినిమాల్లో లాగ ప్రేమనయితే కాదుగానండీ , అందరూ సూసి అటేపెల్లె ఆ అబ్బాయి భుజాన సెయ్యేసి మాట్లాడేందుకు సక్కటి మనసుండాలనుకున్నాండి
తెల్సండి ప్రతారం మీరు నా ఎనకమాలె గుడికొస్తున్నారని, మీరు నన్ను సూసేప్పుడే మిమ్మల్ని నేను సూడ్లేదండి అంతే
మీరు డబ్బుకంటే మడిసికిచ్చిన ఇలువ తెగనచ్చేసిదండి, అప్పుడు గూడా ప్రేమలాంటిది ఏమ్లేదండి మీరంటే అభిమానం తప్ప.

నాక్కూడా కాఫీలు, పిజ్జాలు అలవాట్లేదండి
అమ్మ సేసిన టీ, అమ్మ సేత్తో ఆవకాయన్నం, నేను సేసుకొనే పని ఇయ్యేనండి నా లోకం
నేను పనిసేసేది పెద్ద హోటల్లోలెండి అందుకే నా యేసాలు మీకు ఉన్నోల్లాగానిపించిందేమో

మీరు నా ఎనకమాలె తిరుగుతుంటే భలే బాగానిపిచ్చేదండి, ఏ అమ్మాయికి బాగుండదు సెప్పండి
ప్రేమని, పెళ్లనంటే ఇయ్యన్ని వుండవుగదండి
కాని ఇయ్యేల మొదటిపాలి గుబులెసిందండి మీరు మళ్లీ కానరారేమోని
ఇయ్యేల గూడా ఇది ప్రేమా, ఇంకేదో నాకు తెలీదండి , కాని మీలాంటి మడిసిని ఒడిసిపట్టలేదన్న భాధ ఉండగూడదండి, అందుకే నాను కూడా ధైర్యం సేసి సెప్తున్నానండి

మీ మాట మందులా అనిపించినా, మీ మనసు నాకిష్టమైన ఐస్క్రీంలాంటిదండి , మనువాడదాం మల్లేష్ గారు..
ఇంతకి నా పేరు తెల్దుకదండి మీకు ... సావిత్రి

Sunday, February 2, 2014

మల్లేషన్న ఇష్క్

తాగిన మందు తల్కాయ్ వడ్తే గోలికని మందుల దుకానమచ్చిన
పొద్దుగాల పొద్దుగాల దుకుణం బందుండే, మీదికెంచి ఆన వడ్తుఉండే 
నెత్తి తడిశ్తే సర్దిలేస్తదని సందులకురికితి, ఆగో గప్పుడు జూస్తి నిన్ను

శత్తిరి వెట్టుకొని బట్టల్ కరావయితయని కిందా మీదా జూస్కుంట నడుస్తుంటివి
గదే గల్లికెంచి నలుగురు పోరగాండ్లు ఇష్టయల్ కొట్టుకుంట బండ్ల మీద జుయ్యు జూయ్యుమని పోయిర్రు ఇగేముంది నీ మీద బయ్యుమని బుడదజిల్లె
ఇగ జూస్కో గప్పుడు గాళ్ళని జూష్న సూపు తిట్టిన తిట్లు నాకు మస్తుగా నచ్చినయ్
ఇగనుకున్న, మందుల్నే గింత మంచిగుందంటే దిగినంక అద్దిరిపోద్దని, గప్పుడే ఫిక్స్ అయితి

ఆగే ఆగే నాతో తిర్గితే నీకు తక్లీఫ్ గావద్దని
వందరూపాల షాయ షాప్ల శాయ్ తాగుడు నేర్శిన
రొట్టె ముక్కల దుకాణంల రొట్టేల్దినుడు నేర్శిన
పట్నం శెరువు సుట్టూ పశార్లు కొట్టుడు నేర్శిన

ఇగ మీ ఇంటికాడ శక్కర్లు కొట్టి కొట్టి గాడున్నపిచ్చోడు గూడా బడే దోస్తయ్యిండు,పొద్దుగాల శాయి పొద్దుగూకాల శాయి గాన్తోనే తాగుతుండే
గురారం గురారం గుళ్ళేకొస్తే పంతులేమో పులారకచ్చినట్టు సూస్తుండే, మరింత పెట్టరాదే అంటినని నారాజ్ అయినట్టుండు
ఒక్కపాలన్న గిటేపు జూస్తవని గాడున్న ముష్టానికి పైసలిస్తునేవుండే, ఒక్కదినమన్నా సూపు తిప్పవైతివి
శాన దినాలు నీ ఎంట సుట్టి సుట్టి బేజారయిన, గియ్యన్నిగాదు గాని ఓ ముచ్చటయితే శెప్పాలని దైర్యంజేసి అచ్చిన

పిచ్చోడ్ని నేనొక్కన్నే మనిశిలెక్క సూశ్నని , ముష్టోడు నేను ఎష్న పైసల్తో శెప్పులు కుట్టే దుకుణం పెట్టిండని నన్ను గట్టిగ వట్టుకొని ఎడ్శిర్రు, గప్పుడు గారినయ్ నా కండ్లకెంచి బలబలామని నీళ్ళు

నువ్వు నన్ను పసంద్ జేశ్న జేయకపోయినా నాకు దిల్ అంటే సూపిచ్చినవని దిల్కుష్తో బోతున్నా... వుంటా మళ్ళ.. నీ మల్లేష్.....

Friday, January 31, 2014

జీవితం అందమైనది

ఒంటరి తలపున విరహానివై, జంట వీడని సరసానివై 
అమ్మ మాటల గారడీవై, నాన్న కధల కితాబువై 
పసిపాప కేరింతల బొమ్మవై, బామ్మ అనుభవాల ఆనవాలివై 
కవి మదిలో యోచనవై, మది ఆలోచనల కవితవై
హాయిరాగాల భావానివై, కూనిరాగాల శ్రావకుడివై
గుండె బరువు కరిగించే భాంధవమై, రేపు మరపించి నిద్రపుచ్చే జోలాలివై

నిన్ను చూస్తూ నీ చిరునవ్వుల చిరుగాలి నన్ను తడుముతూ అమ్మ వడిలో నా కనులు ఊహల లోకంలో విహరిస్తుంటే చెప్పాలనిపించే మాట,
చందమామ, జీవితం నీలాగే అందమైనదని మళ్లీ గుర్తుచేసావు

Tuesday, January 28, 2014

నాటకంలో బ్రతికేస్తూ

నవ్వు నకిలీ, మాట మాయ
ప్రేమ మోహం, పెళ్లి వ్యాపారం
గొప్పలు గోపురాలు, తప్పులు తుంపరలు
నీది నీ దిక్కు, నాది నలుదిక్కులు
బంధం సందర్బం, మోసం సంతతం
ద్వేషం దేహం, అహం ఆయువు
ధనం ఇహం, జనం శివం 

నటనని తెలిసి నటిస్తూ,నాటకంలో బ్రతికేస్తూ మనిషి ఆడే జగన్నాటకం ||

Saturday, January 25, 2014

సందడిలేని నిశ్శబ్ద ప్రపంచం

గోడ గడియారంలో కదిలే కాలం,నీళ్ళ కుళాయిలో నుంచి జారిపడే నీటి బొట్టు, హృదయ స్పందనలోని ప్రాణం చప్పుడు నాకు చూపిన సందడిలేని నా నిశ్శబ్ద ప్రపంచం

Wednesday, January 15, 2014

జీవితం

నువ్వులేని నా బ్రతుకు ఆగిపోలేదు కాని నువ్వుంటే బాగుండనిపించిన క్షణం కాలం ఒక్కసారిగా ఆగిపోయిందనిపించేది
అలాంటి క్షణాలు నిమిషాలయ్యాయి, ఆ నిమిషాలన్నీ నాతో రోజులు గడిపాయి
ఆ రోజులే నాకు కొత్త ఆశలిచ్చి నేను ఆగిపోయిందనుకున్న కాలాన్ని ముందుకు నడిపి అదే జీవితమన్నాయి

Monday, January 13, 2014

ప్రేమెంతని చెప్పే కొలమానాలు

ప్రేమ నువ్వంటే ఇష్టమని పదే పదే చెప్పే నా మాటల్లో వినిపించేది కాదు
నీకు కష్టమని తెలిసిన క్షణం నా కనులు తడిమిన నీ చేతిలో కనిపించేది
ప్రేమెంతని చెప్పే కొలమానాలు లేవు పరిస్థితులు తప్ప

Saturday, January 11, 2014

నిజం

మనం నమ్మినపుడు అనిపించేది నిజం, నిజం కాని నిజం వెనకాల మనం నమ్మలేని నిజాలెన్నో
నమ్మిన నిజం నిజం కాదని తెలిసినపుడు అది నిజంగానే నిజమయినా నిజమనుకోము.

Thursday, January 9, 2014

సంస్కారం తెలియనివాడు

చదువుకున్నవాడు చక్కగా మాట్లాడాలని లేదు చదువులేనివాడు సంస్కారం తెలియనివాడని కాదు

Wednesday, January 8, 2014

వక్రభ్రమణం

భూమి తనచుట్టూ తాను తిరిగితే పగలు రాత్రి ఏర్పడుతాయి, అబ్బాయి అమ్మాయి చుట్టూ తిరిగితే పగలు రాత్రి తేడా ఏర్పడకుండాపోతుంది 
భూమి పనిలో పనిగా సూర్యుని చుట్టుకూడా తిరిగితే కాలాలు మారుతాయి,అబ్బాయి పక్క పనిగా అమ్మాయి స్నేహితులతో కూడా తిరిగితే కాలానికో కధ మారుతుంది
అది భూపరిభ్రమణం ఇది బాబు వక్రభ్రమణం

Monday, January 6, 2014

అప్పుడప్పుడైనా చూస్తాం

మనిషిని విమర్శించేప్పుడు మాట కలిపే మనుషులు, మనిషి మనిషి కొట్టుకోనేప్పుడు ఆట చూసే జనాలు ఎక్కడైనా చూస్తాం
మనిషిని మనస్పూర్తిగా ప్రశంసించే మనిషి, మనిషి కష్టాలను పంచుకొనే మనసులు అప్పుడప్పుడైనా చూస్తాం

Sunday, January 5, 2014

పిచ్చోడు

వందమంది చెప్పేది తప్పయినా మంద కాబట్టి అది ఒప్పవుతుంది 
వందలో ఒక్కడు మారి అది తప్పన్నవాన్ని ఆ మంద పిచ్చోడంటుంది

Saturday, January 4, 2014

చెప్పేవాళ్లoదరూ ఆచరించరు

చెప్పేవాళ్లoదరూ ఆచరించరు, ఆచరించేవాళ్ళు చెప్పినా వినేవారుండరు