Saturday, December 7, 2013

ఓ బ్రహ్మచారి మనోవేదన

పెళ్లి చూపులు చూసి చూసి అలసిన ఓ బ్రహ్మచారి మనోవేదన 

పాతికేళ్ళు నిండాయి,అన్ని అర్హతలున్న పెళ్ళీడుకు వచ్చిన కుర్రాడిగా నా స్థితి ||
నాకు అమ్మాయి చదువుతో పాటు అందం వుండాలి
నాన్నకు సొంత ఇల్లుతో పాటు మంచి కట్నం ఇవ్వాలి
అమ్మకి బంగారంతో పాటు పట్నం పిల్ల కావాలి
బామ్మకి కులంతో పాటు గోత్రం తెలిసిందయి వుండాలి

మరో రెండేళ్ళు గడిచాయి,అన్ని అర్హతలున్న పెళ్ళి వయసు దాటిపోతున్న అబ్బాయిగా నా పరిస్థితి ||
నాకు 
అమ్మాయి పెద్ద అందంగా లేకపోయినా గుణం మంచిదయి వుండాలి
బామ్మకి గోత్రం ఏదయినా కులం మాత్రం ఒకటయి వుండాలి
అమ్మకి ఊరి పిల్లయినా బంధువులు గొప్పగా చెప్పుకునే సంబంధం అయి వుండాలి
నాన్నకి కట్నం ఇవ్వకపోయినా ఇల్లు కట్టుకోనేంత స్థలం ఇవ్వాలి

ఇంకో నాలుగేళ్ళు పోయాయి, చెల్లి పెళ్ళి కుడా అయి వయసు తప్ప అన్ని అర్హతులున్న మనిషిగా నా దుస్థితి ||
నాన్నకి లాంచనాల కంటే అమ్మాయి తల్లిదండ్రి పడే బాధలు అవమానాలు కనిపించాయి
అమ్మకి బంగారం కంటే అనురాగం విలువైనదని తెలిసొచ్చింది
బామ్మ బతికుంటే ఏమనుకునేదో తెలియకుండానే పైకి పోయింది
నాతో పాటు ఇప్పుడు ఎవరికీ ఏ ఆంక్షలు లేవు అయినా నాకు పిల్లనివ్వాలన్న కాంక్ష ఎవరికీ లేదు.

No comments:

Post a Comment