Friday, January 31, 2014

జీవితం అందమైనది

ఒంటరి తలపున విరహానివై, జంట వీడని సరసానివై 
అమ్మ మాటల గారడీవై, నాన్న కధల కితాబువై 
పసిపాప కేరింతల బొమ్మవై, బామ్మ అనుభవాల ఆనవాలివై 
కవి మదిలో యోచనవై, మది ఆలోచనల కవితవై
హాయిరాగాల భావానివై, కూనిరాగాల శ్రావకుడివై
గుండె బరువు కరిగించే భాంధవమై, రేపు మరపించి నిద్రపుచ్చే జోలాలివై

నిన్ను చూస్తూ నీ చిరునవ్వుల చిరుగాలి నన్ను తడుముతూ అమ్మ వడిలో నా కనులు ఊహల లోకంలో విహరిస్తుంటే చెప్పాలనిపించే మాట,
చందమామ, జీవితం నీలాగే అందమైనదని మళ్లీ గుర్తుచేసావు

Tuesday, January 28, 2014

నాటకంలో బ్రతికేస్తూ

నవ్వు నకిలీ, మాట మాయ
ప్రేమ మోహం, పెళ్లి వ్యాపారం
గొప్పలు గోపురాలు, తప్పులు తుంపరలు
నీది నీ దిక్కు, నాది నలుదిక్కులు
బంధం సందర్బం, మోసం సంతతం
ద్వేషం దేహం, అహం ఆయువు
ధనం ఇహం, జనం శివం 

నటనని తెలిసి నటిస్తూ,నాటకంలో బ్రతికేస్తూ మనిషి ఆడే జగన్నాటకం ||

Saturday, January 25, 2014

సందడిలేని నిశ్శబ్ద ప్రపంచం

గోడ గడియారంలో కదిలే కాలం,నీళ్ళ కుళాయిలో నుంచి జారిపడే నీటి బొట్టు, హృదయ స్పందనలోని ప్రాణం చప్పుడు నాకు చూపిన సందడిలేని నా నిశ్శబ్ద ప్రపంచం

Wednesday, January 15, 2014

జీవితం

నువ్వులేని నా బ్రతుకు ఆగిపోలేదు కాని నువ్వుంటే బాగుండనిపించిన క్షణం కాలం ఒక్కసారిగా ఆగిపోయిందనిపించేది
అలాంటి క్షణాలు నిమిషాలయ్యాయి, ఆ నిమిషాలన్నీ నాతో రోజులు గడిపాయి
ఆ రోజులే నాకు కొత్త ఆశలిచ్చి నేను ఆగిపోయిందనుకున్న కాలాన్ని ముందుకు నడిపి అదే జీవితమన్నాయి

Monday, January 13, 2014

ప్రేమెంతని చెప్పే కొలమానాలు

ప్రేమ నువ్వంటే ఇష్టమని పదే పదే చెప్పే నా మాటల్లో వినిపించేది కాదు
నీకు కష్టమని తెలిసిన క్షణం నా కనులు తడిమిన నీ చేతిలో కనిపించేది
ప్రేమెంతని చెప్పే కొలమానాలు లేవు పరిస్థితులు తప్ప

Saturday, January 11, 2014

నిజం

మనం నమ్మినపుడు అనిపించేది నిజం, నిజం కాని నిజం వెనకాల మనం నమ్మలేని నిజాలెన్నో
నమ్మిన నిజం నిజం కాదని తెలిసినపుడు అది నిజంగానే నిజమయినా నిజమనుకోము.

Thursday, January 9, 2014

సంస్కారం తెలియనివాడు

చదువుకున్నవాడు చక్కగా మాట్లాడాలని లేదు చదువులేనివాడు సంస్కారం తెలియనివాడని కాదు